రెండు దశాబ్దాల క్రితం వరకూ తెలుగులో ముస్లిములైన రచయితలు ఉండేవారుకానీ, ముస్లిం కథ అంటూ ప్రత్యేకంగా చెప్పుకోదగినంత సాహిత్యం ఉన్నట్లు గుర్తు లేదు. గత రెండు దశాబ్దాలలో ముస్లిం సాంస్కృతిక, సామాజిక నేపధ్యంలో చాలా కథలు వచ్చాయి. ఖదీర్‌బాబు, రహమతుల్లా వంటి కథకులు ముస్లిం జీవన విధానాలని, కుటుంబ బాంధవ్యాలని, సామాజిక సంబంధాలని ముస్లిమేతర పాఠకులకు పరిచయం చేయటంలో కృతకృత్యులయ్యారు. యువ రచయిత శ్రీ వేంపల్లె షరీఫ్ కూడా ఆ బాటనే పయనిస్తున్న కథకుడు అనవచ్చు కానీ, అది షరీఫ్ రాసిన కథల్ని మరీ ఇరుకుగా వర్గీకరించడమౌతుంది. శ్రీ షరీఫ్ ఈ మధ్యే ప్రచురించిన కథాసంకలనం జుమ్మా లో 12 కథలు ఉన్నాయి. రెండు కథల్లో అసలు ముస్లిం పాత్రలే లేవు. మిగతా పది కథలకు ముస్లిం కుటుంబాలే నేపధ్యం ఐనా, వాటిలో కొన్నిటికి ఆ కథలో వ్యక్తులు ఏ మతానికి చెందినవారన్నది అంత ముఖ్యమైన విషయం కాదు. ముస్లిం జీవనం ముఖ్యపాత్ర వహించేది నాలుగు కథల్లో మాత్రమే (పర్దా, జుమ్మా, ఆకుపచ్చ ముగ్గు, తెలుగోళ్ళ దేవుడు). మిగతా కథలు చాలావరకూ రాయలసీమలో పేద కుటుంబాల కథలు. ఆ కథలను పెద్ద మార్పులు లేకుండా హిందూ, క్రిస్టియన్ పాత్రలను పెట్టి రాసినా...