అజయ్ ప్రసాద్ తో వేంపల్లె షరీఫ్ ఇంటర్వ్యూ...

crafting లో art ఉండదు... without art ఏదీ నిలవదు
- బి. అజయ్ ప్రసాద్ 
  
గుంటూరు జిల్లా నకిరేకల్ లో పుట్టారు బి. అజయ ప్రసాద్. 2005లో "మరుభూమి' అనే కథతో కథాసాహిత్యంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంతవరకు పాతిక కథలు రాశారు. వాటిల్లో కొన్ని ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయి. మరికొన్ని ప్రముఖ సంకలనాల్లో వచ్చాయి. అయినా ఎంతో నిరాడంబరంగా ఉంటారు. తనకేమీ తెలియదంటూనే "లోయ, బానిసల స్వర్గం,ఖేయాస్, జాగరణ' వంటి మంచికథలు రాశారు. ఆయనతో కథ గ్రూప్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ............... 1 : మీ దృష్టిలో కథంటే ఏంటి?
జ : ఏదైనా కావొచ్చు. కల, అనుభవం, జ్ఞాపకం, అనేక కోణాలున్న సంఘటన.
2: మీకు కథలు ఎక్కడ పుడతాయి?
జ : ఫలాన చోటంటూ ఏమీ లేదు. నిద్రలో, మెలకువలో, ప్రయాణంలో, నడకలో...లోపల ఎక్కడ్నుంచైనా కథ నడిచి రావొచ్చు.
3 : మీరు కథలు ఎందుకు రాస్తారు?
జ : నా సతోషం కోసం రాస్తాను. అది కళాత్మకంగా ఉంటే ఆనందం. అదొక ఉద్వేగం. సాహసం.
4 : కథకు ఆలోచన పుట్టగానే మొదట మీరేం చేస్తారు?
జ : ఆలోచనో, కథో పుడుతుంది తలలో. తలలోనే ఒక్కోసారి పూర్తవుతుంది. ఇంకొన్నిసార్లు కొన్ని రోజులు ఆగి మళ్లీ తనంతట అదే తిరిగి మొదలవుతుంది. అవసరమనుకుంటే తల్లోనే కాక ఒక్కోసారి కాగితం మీద కూడా ఆలోచనలను రికార్డు చేసి పెట్టుకుంటాను.
5 : ఆరంభం, ముగింపు కోసం ప్రత్యేక సాధన ఏమైనా చేస్తారా?
జ: సాధన ఉండదు. ప్రాపంచిక జ్ఞానం నాకు లేదు. ప్రపంచంలో అనేక విషయాల మీద, అనుభవాల మీద నాకు కనీస పరిజ్ఞానం లేదు. I am always confused man.
6 : సింగిల్ సిట్టింగ్ లో కూర్చుని కథను రాసేస్తారా?
జ: ఒక్కోసారి సింగిల్ సిట్టింగ్ లోనూ పూర్తవుతుంది. అయితే కొన్నాళ్లు దాన్ని మర్చిపోయి తర్వాత చదువుకుంటాను.
7 : సగటున ఒక కథరాయడానికి మీకెంత కాలం పడుతుంది?
జ : ఒకరోజు, ఒక్కోసారి వారం, ఇంకొక్కసారి సంవత్సరపైగా. కథలు రాయడం మొదలుపెట్టిన రోజుల్లో ఏ ఇబ్బందులైతే పడ్డానో.. ఇప్పటికీ అవే ఇబ్బందులు పడుతున్నాను.
8 : మీకు కంప్యూటర్ సౌకర్యంగా ఉంటుందా? చేతిరాత సౌకర్యంగా ఉంటుందా?
జ : రెండూ సౌకర్యంగానే ఉంటాయి. కానీ ధ్యానం ముఖ్యం. అది కథ మీద ధ్యానం కాదు. తనను తాను మర్చిపోయి రాసే ధ్యానం.
9 : కథను మాండలికంలో రాయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
జ : నేను రాసిన కొన్ని మాండలిక కథలూ ఉన్నాయి. నాతోపాటు చదువుకున్న చిన్ననాటి స్నేహితులకు చూపిస్తాను.
10 : రాసిన వెంటనే పత్రికకు పంపిస్తారా?
జ : లేదు. ఒకసారి చదువుకుని ఒకరిద్దరు సహకథకులకు చూపించి ప్రతికకు పంపిస్తాను.
11 : మీరు తరచుగా చేసే తప్పులేంటి?
జ : వ్యాకరణం, సంభాషణలు
12 : తిరిగొచ్చిన మీ కథల గురించి చెప్పండి?
జ : పత్రికలు తిరస్కరించిన కథలు చాలానే ఉన్నాయి. తొలిరోజుల్లో hurt అయినా తర్వాత నవ్వులాట అయ్యింది.
13 : తొలిదశలో కథలు రాయడానికి మీరు పడ్డ కష్టాలు?
జ : ముందే చెప్పాను. కష్టాలు ఇప్పుడూ ఉన్నాయి. తెలుగులో తప్పుల్లేకుండా రాయలేకపోవడమే నాకు కష్టం.
14 : కథలు రాయడంలో ఏది మేలైన పద్ధతి?
జ : నాకు తెలిసి మేలైన పద్ధతంటూ ఏమీ లేదు. ఏకబిగిన రాసుకుంటూ పోవడమే మేలైన పద్ధతి. crafting లో art ఉండదు. without art ఏదీ నిలవదు.
( ఇది కొత్తగా కథలు రాస్తున్నవాళ్లకు ఉపయోగపడేవిధంగా చేసిన ఇంటర్వ్యూ. ధన్యవాదాలు.)
ప్రసాద్ రాసిన లోయ కథ లింకు ఇక్కడ : http://goo.gl/MkfQZK
అజయ్ ప్రసాద్ ఫోన్ నెం : 92477 33602
ఇంటర్వ్యూ : వేంపల్లె షరీఫ్
ఫోటో స్లయిడ్ : మహిబెజవాడ
కథాలింకు సహకారం : రమణమూర్తి

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

జుమ్మా – రాయలసీమ, పేదల, ముస్లిం జీవితాల కథలు - జంపాల చౌదరి